1. చిన్మయస్తుతి - వివరణ

అష్టావక్ర గీత
 చిన్మయస్తుతి - వివరణ:

నమో దేవదేవా ! నమో దివ్య తేజా !
            నమో అద్వైత తత్వార్థ బోధనాయ
మోక్షమొసగు శాస్త్రరూపమే నీవంచు
            నాదు మనమునందు కొలుతు నిన్ను !
గురుదేవ నీ కృపావీక్షణ లేశమ్ము
            గూఢమౌ తత్వార్థ బోధకమ్ము
రుజుమార్గమును జూపు ఋషితుల్యుడవు నీవు
            మార్గదర్శవి మానవాళికెల్ల !
దేశకాలవస్తు గుణరూప జ్ఞానమ్ము
            వాస్తవమ్మున భావమాత్రమౌను
యతివరా, శాస్త్ర స్వరూపా ! నమస్సులివె,
            చిద్రూప చిన్మయానంద స్వామి !
                       
ఈ ప్రార్థనని సరిగ్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే, గురువును ఆశ్రయించి, భగవంతుని యొక్క ప్రతినిధిగా, భగవంతుని దర్శింపచేయగలిగే శక్తి వున్న మహానుభావుడిగా, దివ్యమైనటువంటి తేజస్సుతో నిండియున్నటువంటి ఆ గురుదేవుడిని ఆశ్రయించి, ఆయన ఎటువంటివాడయ్యా అంటే, అద్వైతం, తత్వార్థం ఈ రెండూ బోధించేటటువంటి శక్తి కలిగినవాడు. ఈ రెండింటి వల్ల ఏమిటి ప్రయోజనం అంటే, మోక్షం లభిస్తుంది. ఈ మోక్షం లభించటానికి కావలసినటువంటి ఎన్ని శాస్త్రాలైతే అద్వైతం గురించి, తత్వం గురించి వున్నాయో, అన్ని శాస్త్ర సారముల రూపమే ఆ సద్గురుమూర్తి. కాబట్టి అట్టి సద్గురుమూర్తిని మనసున నిలిపి ఆరాధిస్తున్నాను. నా హృదయములో నిలుపుకుని ఆరాధిస్తున్నాను. కారణమేమిటంటే హృదయంలో కూడా అంతాకూడా అజ్ఞానం అనే అంధకారం వుండడం చేత, చిత్తశుద్ధి లేకపోవడం చేత, మానవుడు చేసేటటువంటి అన్ని పనులు కూడా, అజ్ఞాన ఫలితమైన దుఃఖాన్నే ఇవ్వడం చేత, హృదయస్థానంలో అట్టి సద్గురుమూర్తిని నిలుపుకోవడం చేత, ఆయన దివ్యతేజస్సుయొక్క ప్రభావం చేత, నీలో వున్నటువంటి అజ్ఞాన అంధకారం దూరమై, ఆ కృపా వీక్షణం అనేటటువంటి నీ హృదయస్థానం ....

            మామూలుగా ఎవరైనా గానీ గురువుగారి దగ్గరకు వెళ్ళి, ఆయన పాదాల మీద పడే ప్రయత్నం చేస్తారు. ఎందువల్ల అంటే, ఆయన చేసినటువంటి, శరీరాన్ని పనిముట్టుగా వుపయోగించి, చేసినటువంటి పుణ్య కార్యక్రమాలు, అన్ని సాధనలు, అన్ని తపస్సులకి ఆధారం, ఆ శరీరమనే రథానికి ఆ పాదాలే ఆధారం కాబట్టి, ఆ పాదములనే ఆశ్రయించి ఆ తపోఫలమంతా వుంటుంది కాబట్టి అట్టి తపోఫలాన్ని ఆశ్రయిస్తున్నాను, శరణాగతి చెందుతున్నాను అనే భావన చేత ఆయన పాదాలమీద పడుతుంటారు. కానీ అజ్ఞాన అంధకారం ఎక్కడ వుందటా? హృదయస్థానంలో వుంది. అట్టి హృదయస్థానంలో వున్న  అజ్ఞాన అంధకారం దూరం అవ్వాలి అనేటటువంటి ఒకే ఒక లక్ష్యం చేత, గురువును ఎవరైతే ఆశ్రయిస్తారో, ఎవరైతే హృదయంలో గురువును అట్లా నిలుపుకుంటారో, ఎవరైతే మూడు అవస్థలలోనూ గురువు వద్దే తాను వున్నానని, గురువు యందే తాను వున్నానని, గురువు తనయందు వున్నాడని, తనను రెప్పపాటుకూడా విడువకుండా గమనిస్తూ వున్నాడని ఎవరైతే గురువుని అనుగమిస్తారో, ఆశ్రయిస్తారో వాళ్ళకి గురుకృపా వీక్షణ లేశము, లేశమంటే? చాలా తక్కువ. అణుమాత్రం. అంటే గురువు సాంతం కళ్ళు తెరిచికూడా చూడక్కర్లేదు. తత్వార్థం తెలియాలి అంటే, గురువుగారు అర్థనిమీళిత నేత్రుడై వుండి, రెప్పలు కొంచెంగా ఎత్తుకుని కొంచెం ఒకసారి అలా చూస్తే చాలట. అట్లాంటి వీక్షణ లేశము చేతనే, నీకు తత్వార్థమంతా బోధ పడుతుంది. అదిట గురువుగారి యొక్క కృప అంటే.

            అది ఎక్కడ నిలబడాలి అంటే, హృదయస్థానంలో నిలబడాలి. అప్పుడు నీకు ఋజుమార్గం అంటే ఏమిటో తెలుస్తుంది. ఋజుమార్గం అంటే అందరూ ఏమనుకుంటారు? అంటే, వక్రంగా లేకుండా, బుద్ధి వక్రత లేకుండా, స్వభావ వక్రత లేకుండా, సరియైనటువంటి సరళ బుద్ధి కలిగి వుండడాన్ని ఋజుమార్గం అంటారు. అయితే శరీరం, ప్రాణం, మనస్సు, బుద్ధి ఈ నాలిగిటికి పైన చిత్తం దానికి ఆధారమైనటువంటి మూలస్థానంలో వున్న అహంకారం. ఇవన్నీ కూడా ప్రకృతి ధర్మంగా, మాయా మయంగా, భ్రాంతి పద్ధతిగా, పనిచేస్తూ, లేనివి వున్నట్టు, వున్నవి లేనట్టు చూపెట్టే పద్ధతిలో వికాసం చెందుతూ వుంటాయి. ఈ ప్రకృతిని ఆశ్రయించి వికాసం చెందే సాపేక్ష పద్ధతి అంతా కూడా వున్నది లేనట్టు, లేనిది వున్నట్టు బుద్ధి కల్పిస్తూ, పైనున్నటువంటి చిత్తం, అహంకారానికి అభ్యాసబలం చేత తోడ్పాటు చేస్తూ, అనేక రకాలైనటువంటి వంకర టింకర మార్గాలన్నీ ఏర్పడుతూ వుంటాయి. అలాంటివి అన్నీ కూడా, ఈ తత్వార్థం తెలిస్తే వచ్చినటువంటి నూతనమైన దృష్టి చేత, వీటన్నింటినీ కూడా, ఒకే మార్గంలో, ఒకే సూత్రంలో, ఒకే దృష్టితో, నడపగలిగేటటువంటి శక్తి కలుగుతుంది. కాబట్టి గురుకృపా వీక్షణ లేశము చేత శిష్యుడికి తత్వార్థం బోధపడింది. తత్వ దృష్టి కలిగింది. ఆ తత్వ దృష్టితో తన శరీర ప్రాణ మనో బుద్ధి చిత్త అహంకారాలని నడపగలిగేటటువంటి శక్తి కలిగింది. అలాంటి ఋజుమార్గంలో నడవడం చేత, మహానుభావుడైనటువంటి సద్గురుమూర్తి ఎట్లా అయితే మహర్షి అయ్యాడో, అటువంటి మహర్షిత్వాన్ని తాను కూడా పొందే అవకాశాన్ని శిష్యుడు పొందుతాడు. కాబట్టి ఇప్పుడు అక్కడ గురువులో ఈ తత్వార్థ దృష్టితో చూచేటప్పటికి, అప్పటి వరకూ గురువు అన్నవాడు కాస్తా, మహర్షి అయ్యాడు. అట్టి మహానుభావుడవి ఎటువంటి వాడవయ్యా అనే తత్వజ్ఞాన దృష్టితో చూస్తే మానవాళికెల్లా మార్గదర్శిగా కనిపించాడు. అప్పటి వరకూ తనకు మాత్రమే మార్గదర్శి అనుకున్నాడు.

            ఈ తత్వజ్ఞాన దృష్టితో కనుక చూచినట్లయితే, మానవులకందరికీ కూడా మార్గదర్శనం చేసేటటువంటి మహర్షిగా కనపడ్డాడు. ఇది దృష్టి భేదం వల్ల కలిగినది. అంతకు ముందు కేవలం తాను, తను ఉద్ధరించడం అనేటటువంటి వ్యక్తిగత దృక్పథంతోనే చూశాడు. కానీ, ఎప్పుడైతే నీకు తత్వదృష్టి కలిగిందో, జ్ఞానం కలిగిందో ఆ తత్వజ్ఞానం దృష్ట్యా నువ్వు దేనిని చూచినా, గురువుని చూచినా ఆగురువు అప్పుడు ఎలా కనపడ్డాడట? మహర్షివలె కనపడ్డాడు. మహర్షి ఎలా అయ్యాడయ్యా అంటే, సమస్త మానవాళికి మార్గదర్శనం నిర్వహించేటటువంటి మహనీయుడిగా కనపడడం చేత. ఇదంతా నీకు ఎక్కడినుంచి లభించిందయ్యా అనంటే, గురుకృపా వీక్షణం అణుమాత్రం చేత లభించింది. ఆయన యొక్క గురుకృపా వీక్షణం, వీక్షణం అంటే చూడటం. అలాంటి దృష్టి చేత, నీ హృదయంలో వున్నటువంటి అజ్ఞాన అంధకారం దూరమై, ఆయనలో వున్నటువంటి దివ్య తేజస్సుచే అంతా కూడా నీ హృదయం అంతా నిండిపోయింది. అప్పుడు ఏమైందట? అలా చూస్తే దేశము, కాలము, వస్తువు, గుణము, రూపము ఈ అనంత ప్రకృతి, అప్పటి వరకూ ఆద్యంతములు కలిగినటువంటి ప్రకృతి, ఇప్పటి వరకూ ఎలా తోచింది? అనంతంగా తోచింది. అంటే చూసే కొద్దీ చూడాలని, తెలుసుకునే కొద్దీ తెలుసుకోవాలని, అనుభవించే కొద్దీ అనుభవించాలని అనిపించేటటువంటి ఈ సమస్త ప్రకృతి కూడా ఏ లక్షణాలతో కూడుకుని వుందటా? ఒక దేశం చేత పరిమితమై, ఒక కాలం చేత పరిమితమై, ఒక వస్తువు చేత పరిమితమై, ఒక గుణం చేత పరిమితమై, ఒక రూపం చేత పరిమితమైనటువంటి జ్ఞానాన్ని మాత్రమే ఇస్తుంది.

            ఈ ప్రకృతి అంతా కూడా ఈ జ్ఞానాన్నే ఇస్తోంది. ఎటువంటి జ్ఞానం ఇస్తోందట? దేశముకాలము, వస్తువు, గుణము, రూపము ఈ ఐదు లక్షణాల చేతనే పరిమితమైన జ్ఞానాన్ని అందివ్వగలుగుతోంది గానీ, అనంతమైనటువంటి జ్ఞానాన్ని అందించడం లేదు. కాబట్టి ఈ ఐదు కూడా కేవలం భావమాత్రమే. వాస్తవంగా ఈ ఐదు లక్షణాలు లేవు. దేనికి లేవట? ప్రకృతికి కూడా లేవు. కారణం? ఈ ప్రకృతి ఎవరిచేత సృష్టించబడింది? పరమాత్మ చేత సృష్టించబడింది. మరి ప్రకృతికి ఏ లక్షణాలు వుండాలి? పరమాత్మ లక్షణాలే వున్నాయి. కానీ నీకు ఈ ఐదు లక్షణాలు పరిమితంచబడినటువంటి బుద్ధి పనిచేయడం చేత, పరమాత్మ కనపడడం లేదు, ప్రకృతి కనబడుతుంది. ఈ ఐదు లక్షణాలు కనుక నీలోనుంచి దూరమైతే, నీవు ఈ ఐదు లక్షణాలకు గనుక అతీతంగా వుండగలిగినట్లయితే, నీ బుద్ధి వీటిని అధిగమించినట్లయితే, నీ ప్రజ్ఞ వీటిని అధిగమించినట్లయితే, నీకు వివేకం గనుక ఈ ఐదిటిని అధిగమించిన పరిస్థితిలో వున్నట్లయితే అప్పుడు కనపడుతున్నటువంటి వాస్తవంగా కనపడుతున్నటువంటి ఈ ప్రకృతి అప్పుడు ఎలా కనపడిందట? పరమాత్మ రూపంతో కనపడింది. అర్థమైందా అండీ!

            దేశము, కాలము, వస్తువు, గుణము, రూపము ఈ ఐదు లక్షణాలు కూడా పరమాత్మలో ఐక్యం చెంది కేవలం పరమాత్మ ఒక్కడే కనబడుతున్నాడు. ప్రకృతిరూపంలో వున్న పరమాత్మ కనబడుతున్నాడు. అరూపంగా కూడా పరమాత్మ కనబడుతున్నాడు. రూపం లేకుండా కూడా పరమాత్మ దర్శనం వుంది. ప్రకృతి రూపంలో కూడా పరమాత్మని చూడవచ్చు. అటువంటి భావాన్ని నీకు గురుకృపచేత తత్వజ్ఞాన దృష్టి చేత కలుగుతుంది. అటువంటి జ్ఞానాన్ని నీకు అందించేటటువంటి వాడు ఎవరయ్యా అని అంటే యతివరా! వరా అంటే శ్రేష్ఠుడు. ఉత్తమమైనవాడు. యతులలో ఉత్తమమైనవాడు. శ్రేష్ఠుడు. శాస్త్ర స్వరూపా! ఆయన స్వరూపం ఏమిటయ్యా అనంటే, ఆయన స్వరూపమే శాస్త్రాలుగా వ్యక్తం అయ్యింది. అంతే గాని శాస్త్రాలు ఆయన స్వరూపం గురించి వ్యక్తం చేస్తున్నాయనికాదు. నీ స్వరూప జ్ఞానమే వాగ్రూపంలో పెడితే శాస్త్రం అయింది. ఇప్పటి వరకూ మనం ఏం చేస్తున్నాం? శాస్త్రాన్ని చదివి స్వరూపజ్ఞానాన్ని తెలుసుకోవాలని మన అభిప్రాయం. అర్థమైందా అండీ ! గురువు ఏమంటున్నాడు? స్వరూప జ్ఞానమే వ్యక్తీ కరించబడినప్పుడు శాస్త్రం అయింది. గురువుగారు జ్ఞానానుభవంలో వుండి చెబితే అది ఉపనిషత్తు అయ్యింది. ఒక శిష్యుడిని ఉద్దేశ్యించి చెబితే అది ఉపనిషత్తు అయ్యింది. ఉపనిషత్తులు ఇప్పుడు గురువుగారు తెలియజేస్తున్నాయా? గురవుగారు తన అనుభవజ్ఞానాన్ని వ్యక్తీ కరిస్తే ఉపనిషత్తు అయ్యిందా? వ్యక్తీ కరిస్తే ఉపనిషత్తు అయ్యింది. అర్థమైందా అండీ!

            ఇప్పుడు మనం అందరమూ చేసే ప్రయత్నం ఎలా చేస్తున్నామండీ? శాస్త్రం చదివి ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవాలి అనుకుంటున్నాం. ఇది సాధ్యమా? అని ప్రశ్న వేసుకోమంటున్నారు. నీలో వున్నటువంటి ఆత్మజ్ఞానానుభవాన్నీ వ్యక్తీ కరిస్తే శాస్త్రం అయ్యింది. కానీ మరి శాస్త్రం నిష్ప్రయోజనమా? ప్రయోజనమే. ఏమిటట? శాస్త్రం గురువు దగ్గరకు దారి చూపెడుతుంది. అంతే! దానితో దాని పని అయిపోతుంది. అంటే అర్థం ఏమిటట? ఏమండి నేనే భగవద్గీత 18 సంవత్సరాల నుంచీ పారాయణం చేస్తున్నాను. అధ్యయనం చేశాను, కంఠోపాఠంగా నాకన్నీ భావార్థంతో సహా వచ్చు. నాకు నిజజీవితంలో దానిని నూటికినూరుపాళ్ళు పాటిస్తున్నాను. నాకు గురువుతో పనిలేదు. అన్నావే అనుకో! అర్థమైందా అండీ! అంటే అప్పుడు ఏమైనట్టు? శాస్త్రం దగ్గర ఆగిపోయింది. ఈ శాస్త్రం ఎక్కడికి దారి చూపెట్టాలట? ఒక గురువు దగ్గరకు తీసుకెళ్ళి విడిచిపెట్టేంతవరకే దానిపని. తరువాత శాస్త్రం పని అయిపోయింది. తరువాత బాధ్యత ఎవరిదట ఇప్పుడు? గురువుగారిది. అర్థమైందా అండీ!

            కాబట్టి ఎప్పుడైనా సరే, మీరు ఏదైనా ఒక శాస్త్రాన్ని అధ్యయనం చేసేటప్పుడు ఈ సత్యాన్ని గ్రహించాలి. అందుకని అక్కడ శాస్త్ర స్వరూపా అనే వాక్యం వేసారు. అంటే అర్థం ఏమిటట? ప్రపంచంలో అజ్ఞాన దృష్టితో చూచినప్పుడు శాస్త్రం జ్ఞానాన్ని ఇచ్చేదిగా కనపడుతున్నది. కానీ ఈ శాస్త్రం ఎక్కడికి తీసుకెళ్ళి విడిచిపెట్టాలి అంటే, స్వరూప జ్ఞానం కలిగిన గురువు దగ్గరకు తీసుకెళ్ళి విడిచిపెట్టగానే దానిపని అయిపోతుంది. గురువు తన స్వరూపజ్ఞానానుభవం చేత నీ అజ్ఞానాన్ని పోగొడతాడు. అంతే గానీ, శాస్త్రం చేత అజ్ఞానం పోగొట్టడానికి వీలుకాదు. అని అర్థం. కాబట్టి మీరు ఏదైనా సరే ఒక శాస్త్రాన్ని తెలుసుకునేటప్పుడు, అధ్యయనం చేసేటప్పుడు ఈ భావాన్ని దృష్టిలో వుంచుకోవాలి. అంటే గురువుని అన్వేషించడానికి, నీకు తగినటువంటి గురువును అన్వేషించడానికి శాస్త్రం వుపయోగపడుతుంది. దానినే శాస్త్ర దృష్టం అన్నారు. అంటే అర్థం ఏమిటి? చాలా మంది మన సర్వ వేదాంత శిరోభూషణంలో కూడా మొట్టమొదట రాసినట్టు వుంది, శాస్త్ర దృష్టం, గురోర్వాక్యం, తృతీయం ఆత్మనిశ్చయం, చతుర్థం సంశయచ్ఛేదం, పంచమం ముక్తి దాయకం. ఈ ఐదు క్రమంలో, ఈ ఐదు స్థితులలో సాధకుడు పరిణామం చెందుతాడు. మొదట శాస్త్ర దృష్టం, అంటే అర్థం ఏమిటట? తాను జీవించే జీవన విధానాన్ని, తాను తెలుసుకున్నటువంటివి, విన్నటువంటివాటిని శాస్త్ర దృష్ట్యా విచారణ చేయాలి. చేస్తే ఏమిటి ప్రయోజనం? అంటే, అనుభవజ్ఞుడైనటువంటి గురువు దగ్గరకి నీవు అన్వేషణలో భాగంగా ఈ శాస్త్ర దృష్టాన్ని చేస్తున్నావు. చేశావు. గురువు దగ్గరకు వెళ్ళావు. ఏమైందట? ఏవండీ నాకు భగవద్గీతలో ఫలానా విషయం చెప్పండి. ఫలానా శ్లోకానికి అర్థం చెప్పండి. అని అడుగరాదు. ఎందుకనిట? ఆయన అనుభవజ్ఞానం వ్యక్తీ కరిస్తే ఈ గీతలు ఎన్నైనా చాలవట. అర్థమైందా అండీ !

            అంటే అర్థం ఏమిటట? ఇప్పుడు భగవద్గీతా సారాంశం ఒక్కటే శ్రీకృష్ణుడా? కాదుగా. శ్రీకృష్ణుడు భగవద్గీత చెప్పాడండీ! భగవద్గీత చెప్తే ఇప్పుడు ఆ భగవద్గీత సారాంశం అంతా కలిపి అది ఒక్కటేనా శ్రీ కృష్ణ పరమాత్మ అంటే? అది పరమాత్మలో ఒక అంశీభూతం. ఒక అంశను వ్యక్తీ కరిస్తే భగవద్గీత అయ్యింది. అదే ఉద్ధవుడికి చెబితే ఉద్ధవగీత అయ్యింది. అర్థమైందా అండీ! అలాగే భీష్ముడికి చెబితే భీష్మగీత అయ్యింది. అలాగే అష్టావక్రుడు చెబితే అష్టవక్రగీత అయ్యింది. వశిష్ఠుడు చెబితే వశిష్ఠ గీత అయ్యింది. ఎవరు చెబితే, వారి పేరుమీద అది ప్రచారంలోకి వచ్చింది. అర్థమైందా అండీ! ఇప్పుడు ఆ ఒక్కటేనా వశిష్ఠుడు అంటే యోగ వాశిష్ఠం ఒక్కటేనా వశిష్ఠుడు? కాదు కదా! కాబట్టి శాస్త్రంతో గురువును నిర్ణయించడం వ్యతిరేక విధానం. సరైన విధానం కాదన్నమాట. అర్థమైందా అండీ!

            గురువు తనలో వున్నటువంటి అవ్యాజ కరుణ చేత, శిష్యుడిని ఉద్ధరించాలని తాను క్రిందకి, శిష్యుడి హృదయంలోకి దిగివచ్చి, శిష్యుని యొక్క అజ్ఞానావస్థని, తను పడుతున్న దుఃఖాన్ని అర్థం చేసుకొని, అతని యొక్క దుఃఖాన్ని పోగొట్టటానికి తాను చేసినటువంటి ఒకానొక ప్రయత్నం ఆ బోధ. కాబట్టి శాస్త్రం ఎక్కడికి తీసుకెళ్ళి విడిచిపెడుతుందయ్యా? అంటే, నీకు తగిన గురువు దగ్గరకు తీసుకెళ్ళి విడిచిపెడుతుంది. గురువును అన్వేషించడానికి వుపయోగపడే సాధనం. గురువు తన అనుభవజ్ఞానంతో నీ అజ్ఞానాన్ని పోగొట్టాలి. అంతేగానీ, ఫలానా శాస్త్రం చదివితే నీకు మోక్షం వస్తుందనో, ముక్తి వస్తుందనో, ఫలానాది చేస్తే నీకు ఇలా వస్తుందనో చెప్పడం (సరైన) విధానం కాదు. అనుభవజ్ఞానంలో వున్నటువంటి గురువు ఎప్పుడైనా సరే, నీవు అతడిని ఆశ్రయించడం అంటే, నిన్ను ఉద్ధరించడం అనే దైవీ ప్రణాళికలో భాగంగా తాను ఉపయోగపడుతున్నాడు. తానేమీ నిన్ను ఉద్ధరించడంలేదు. ఎందుకనిట? ప్రపంచంలో ఏ జీవినైనా వుద్ధరించాలి అనంటే "ఉద్ధరేత్‌ ఆత్మనాత్మానాం ఆత్మానమవసాధయేత్‌"- అంటే అర్థం ఏమిటి? నీ ఆత్మయొక్క జ్ఞానం ఏదైతే నీయందు నిగూఢంగా వున్నదో, అదే నిన్ను వుద్ధరిస్తుంది నాయనా! ఎందుకని? ఆత్మ సర్వవ్యాపకం, అనంతం, అప్రమేయం. మరి అటువంటి ఆత్మ నీయందు వుండగా మరళా నేనొకణ్ణి రెండవవాడిని వచ్చి వుద్ధరిస్తున్నాను అన్నానే అనుకోండి, అప్పుడేమయింది? ద్వైతం వచ్చిందిగా! నువ్వు వేరే, నేను వేరే. మరప్పుడు ఆత్మానుభవంలో ఇద్దరు వున్నారా? లేరుగా. గురుశిష్యులు అనేవారు లేరుగా. ఎవరున్నారు మరి? కేవలం ఒక్కళ్ళే ఉన్నారు. ఆ అనుభవజ్ఞానానికి సాక్షి అయినవాడు ఎవడైతే వున్నాడో, వాడొక్కడే వున్నాడు. అక్కడ అనుభవమూ లేదు. అనుభవించేవాడూ లేడు. అనుభవించబడేది లేదు. అటువంటి మూడూ లేనటువంటి అతీతమైనటువంటి స్థితిగా ఆత్మానుభవం వున్నది.

            మరి పంచకోశాలు లేవా? వున్నాయి అంటున్నారా? లేదా? శాస్త్రజ్ఞానం ఏమని చెబుతోంది? పంచకోశాలు వున్నాయి అంటోందా లేదా? అంటోందా? పరి పంచకోశాలు వున్నాయా లేవా ఇప్పుడింతకీ? ఆత్మను ఒకదానిమీద ఒకటి కప్పినాయి. అంటున్నావా లేదా? కప్పినాయా? ఆత్మను కప్పగలవా ఏవైనా? కప్పలేవుగా. ఎందుకనీ? ఆత్మ సర్వవ్యాపకం, అనంతం. అంతేకదా! మీ వివేకచూడామణి అంతా ఏం చెబుతోంది? ఆత్మను కప్పినవి అంటోందా లేదా? కొన్ని వేదాంత శాస్త్రాలలో మనకు ఏమని చెబుతోంది? ఆత్మ లోపల వుంది. పైన అన్నమయ్యకోశం, ప్రాణమయకోశం, మనోమయకోశం, విజ్ఞానమయకోశం ఒకదానిమీద ఒకటి కప్పినాయి. లోపల స్వప్రకాశం వుంది, స్వరూపజ్ఞానం వుంది. ఇవి ఉల్లిపాయ పొరలవలె అలా ఏవో ఉపమానాలు చెప్పారు. అరటి పువ్వు వలె ఇలా ఏవో చెప్పారు. ఇలా చెప్పడం సబబేనా? అంటే, అజ్ఞాన దృష్టితో వున్నవాడికి, బుద్ధి వికాసము లేదు కాబట్టి, వివేకము లేదు కాబట్టి, తత్వజ్ఞాన దృష్టిని సరాసరి అందుకోలేడు కాబట్టి, గురువుగారి తత్వజ్ఞాన దృష్టిని, శిష్యుడు సరాసరి అందుకోగలుగుతాడా? అందుకోలేడు కదా! అందుకని, శిష్యుడి యొక్క ఊహకు అందుబాటులో ఏవి వున్నాయో, ఎట్లా అయితే... ఇప్పుడు వ్యాసభగవానుడు బ్రహ్మసూత్రాలు రచించాడండి. వేదాలను విభజించాడండీ! మరి అష్టాదశపురాణాలు చెప్పవలసిన అవసరం ఏమి వచ్చింది? ఈ కథ రామాయణం, భాగవతం, భారతం ఇవి చెప్పాల్సిన అగత్యం ఏమి వచ్చింది? అవి అంతకంటే పెద్దవే తత్వజ్ఞానానికి సంబంధించినవే చెప్పారుగా? మరి అన్ని ఉపనిషత్తులు ఆయనేకదా రాసింది. అక్కడితో ఊరుకోవచ్చుగా. ఆఁ.. అంటే అర్థం ఏమిటట? నిన్ను ఉద్ధరించాలనే అవ్యాజమైన కరుణ చేత, నీ ఊహకు అందుబాటులో వుండేట్టుగా, నువ్వు అందిస్తే అందుకోవడానికి, చెయ్యి అందిస్తే అందుకోవడానికి అందుబాటులోకి వచ్చే పద్ధతిలో చెబుతున్నాడన్నమాట. అర్థమైందా అండీ !  

            అందుకని గురువుకి ఎప్పుడూ కూడా మూడు లక్షణాలు వుంటాయి. తన జ్ఞానానుభవ ప్రకాశము చేత నీలో వున్నటువంటి అజ్ఞానాన్ని పోగొడుతాడు. ఇంకేం చేస్తాడు? తాను క్రిందకు దిగి వస్తాడు. తానెప్పుడూ పైన కూర్చుంటే శిష్యుడు అందుకోలేడని తెలిసీ, అవ్యాజకరుణ చేత శిష్యుని హృదయంలోకి తాను దిగి వస్తాడు. ఆ దిగిరావడానికి ఏదైనా చేస్తాడు. అది రెండవ లక్షణం. మూడవ లక్షణం ఏమిటట? శిష్యుని వద్ద వున్నటువంటి అంటే జీవితం ఉద్ధరించబడాలి, ఈ మోక్షం కోసమే నా జీవితం అని నిర్ణయించబడినటువంటి సచ్ఛిష్యుడిని ఉద్ధరించడం కోసమని, శిష్యుని యొక్క వాసనాబలం మొత్తాన్ని తానే స్వీకరిస్తాడు. స్వీకరించి తన వద్ద వున్నటు వంటి అపారమైనటువంటి తపఃశక్తి ప్రభావం చేత జనించినటువంటి జ్ఞానాగ్నిలో ఆ వాసనాబలం దగ్ధమయ్యేట్టుగా చేస్తాడు. దాని వల్ల ఆ శిష్యుని యొక్క అంతరంగం పరిశుద్ధమైపోయింది. ఇవి మూడు పద్ధతులు. ఉద్ధరించడం అంటే ఈ మూడు చేయగలిగి వుండాలి. ఇది గురువు అంటే. గురుస్థానాన్ని స్వీకరించినవారికి ఈ మూడు శక్తులు వుండాలి. అంటే తాను తన జీవితాన్ని ఈ మూడింటి మీదా నడపాలి. దైవీ ప్రణాళిక అంటేనే ఈ మూడు. బాగా గుర్తు పెట్టుకోండి. అంటే దైవీ ప్రణాళిక మేరకు జీవిస్తున్నాను అంటే అర్థం ఏమిటంటే, నీకు అనంతమైనటు వంటి బ్రహ్మ యొక్క అనుభవంతో ఆ బ్రహ్మానుభవంలో స్థితమై, స్థిరమై వుండాలి. దానిని దేనికి వినియోగించాలట? ఎవరైతే ఆశ్రయించినవారు వున్నారో, వారి యొక్క హృదయంలోకి వారిని అర్థం చేసుకుని, వారి హృదయంలోకి దిగిరావాలి. ఆ అనంతమైనటువంటి స్థితి నుంచి పరిమితమైనటువంటి, ఆశ్రయించినటువంటి సాధకుల హృదయంలోకి దిగిరావాలి. దిగివచ్చి వారికి అందుబాటులోకి వచ్చేట్టుగా వారి జీవితాన్ని సంస్కరించాలి. ఆ సంస్కరించే క్రమంలో వారి వాసనా బలాన్నే ప్రతిఫలంగా, దక్షిణగా పుచ్చుకుని తన యొద్ద వున్నటువంటి తపోఫలం చేత లభించినటువంటి జ్ఞానాగ్నిలో శిష్యుని యొక్క వాసనాబలాన్ని దగ్ధం చేయాలి. చేస్తే సచ్ఛిష్యుడు సిద్ధుడై స్వయముగా అతనిలో వున్నటువంటి స్వరూప జ్ఞానానుభవం అతనికి ప్రకటితం అవుతుంది.

            ఇప్పుడు అతనిలోనే వుందా లేదా? కనబడడం లేదు.  ఎందుకు కనపడడం లేదట? అడ్డం ఏం చెబుతున్నావు? ఆ జీవిలో వున్నటువంటి వాసనాబల ప్రభావం చేత, అది కనబడడం లేదు అంటున్నావు. మరి వాసనాబలం పోవాలిగా. పోవాలి అంటే మరి ఎట్లా పోతుంది? అంటే, తనకు తాను స్వయంగా ప్రయత్నం చేసి పోగొట్టుకోవడం నీవల్ల అయ్యే పని కాదు. నువ్వు ఏం చేయవచ్చయ్యా? అంటే, సచ్చిష్యుడిగా అర్హత పొందే ప్రయత్నం చేయవచ్చు. నువ్వు చేయగలిగినది ఒకటే పని. ఏమిటి? హృదయంలో సద్గురువుని నిలుపుకోవడం, శరణాగతి చెంది, సదా మూడు అవస్థలలో గురువు కనుసన్నలలోనే జీవించడం అనేది ఒక్కటే శిష్యుడు చేయగలడు. అంతకు మించి ఏమీ చేయలేడు. ఎందుకనిట? తనను తాను అర్పించుకొనట కంటే శిష్యుడు మరి నీకేమిచ్చిను? ఆయన దగ్గర ఏముందట? నీ దగ్గర ఏముంది? హృదయం తప్ప మరొకటి ఏమీ లేదు. మిగిలినవి నీ దగ్గర వున్నా అవి గురువుకు పనికి రావు. అర్థమైందా అండీ!

            నీ ధనం అది గురువుకి ఏమీ పనికిరాదు. నీ ఆస్తులు వాటితో అస్సలు పనిలేదు. పోనీ నీ కుటుంబం ... నీకే బరువు అయితే నాకు ఎందుకు అదంతా? అది అనవసరం. ఇంకేమున్నాయి నీ దగ్గర? అంతేకదండీ, ఇవే కదా నీ దగ్గర వున్నాయి, చెప్పుకోవడానికి ప్రత్యేకమైనవి నీ దగ్గర ఏమున్నాయి? అంటే, అనేక జన్మ సముపార్జితమైనటువంటి, ఇందాక చదువుకున్నటువంటి దేశ, కాల, వస్తు, గుణ, రూపం. నీ వాసనలు ఈ అయిదింటిలో వున్నాయా లేవా? ఇప్పుడు వాసనాబలం అంటే ఎన్ని లక్షణాలతో వుందట? ఈ అయిదు లక్షణాలతోటి వున్నది. దేశం, కాలం, వస్తు, రూపం, గుణం మీరు ఏదన్నా చెప్పాలనుకోండి ఏం చెప్తారు? ఎలా చెప్తారు? ఈ అయిదు లేకుండా చెప్పండి చూద్దాము? ఏదైనా సరే, మీరు ఏదన్నా ఒకరు చెబుతున్నది విన్నారండీ! అది మీకు అర్థం కావాలండీ! ఈ అయిదు లక్షణాలు వుంటే అర్థమైందా? ఈ అయిదు లక్షణాలు లేకపోతే అర్థమైందా? వుండాలి కదండీ! మరి ఆత్మ స్వరూప లక్షణాలు గానీ, బ్రహ్మజ్ఞానానికి సంబంధించిన లక్షణాలు గానీ, ఈ అయిదిటితో పనిలేకుండా చెబుతున్నాడుగా. అది అర్థమౌతుందా అప్పుడు. బుద్ధి అర్థం చేసుకోగలుగుతుందా? ఏమని సమాధానం చెబుతోంది? దీనికి సంబంధించిన సామాచారం నా దగ్గర ఏమీ లేదు అంటోంది. ఉదాహరణ: తురీయం అని చదువుకున్నారు మీరంతా. తురీయానికి సంబంధించింది ఏమైనా గానీ బుద్ధి మీకు అందిస్తుందా? ఎందుకు అందించడం లేదు? అది అందించాలిగా లెక్క ప్రకారము. నీకు అందించేది ఏదైనా అది బుద్ధే కదా! తురీయం విషయం చదివావండీ! తురీయం విషయం చదువుతావే గానీ, అదేమీ అవగాహనకు రాలేదు. అనుభవానికి రాలేదు. ఓహో! ఇది ఒకటి వుంది అని తెలుసు అంతే! ఎందుకని మహానుభావుల దగ్గర వినడం కానీ, ఆ ప్రవచానలలో వినడం కానీ, శాస్త్రంలో చదవడం గానీ వరకే తెలుసు. మరి నీకు స్వయంగా తెలుసా? తెలియాలి అంటే మరి ఆయనేమంటున్నాడు అక్కడ?

            అది మూడు అవస్థలలోనూ కలిసిపోయి వున్నది. నాలుగో అవస్థకాదు. మూడు అవస్థలలోనూ ఒక్కతీరుగా వుండి, మూడవస్థలచేత ప్రభావితం కాకుండా వుండి ఏదైతే వున్నదో నీలో, ఆ స్థితిలో గనుక నీవు వుంటే, అది తురీయము. అని ఒక నిర్వచనము. ఇదే తురీయమా? అంటే వీలుకాదు. అది ఒక నిర్వచనము. ఆ తురీయ స్థితిలో వున్నదానిని వాగ్రూపములో పెడితే, ఒక అంశని ఇట్లా చెప్పవచ్చు. మరి అదే తురీయమా అనిఅంటే అది అట్లా చెప్పడానికి వీలుకాదంటాడు ఆయనే. మీకు అందుబాటులోకి రావాలి కాబట్టి నేను ఇలా చెబుతున్నాను. ఇంతకంటే నువ్వు ఎక్కువ ఊహించలేవు. ఇదే నీ ఊహకు అందడంలేదు కాబట్టి, ఇంతకంటే
పై స్థితిని అసలు ఊహించలేవు. నీకు అందుబాటులోకి రాదు. కాబట్టి, ఏదైతే సర్వవ్యాపక జ్ఞానం వున్నదో, సర్వవ్యాపక సచ్చిదానందం అనండి, అనంత శక్తి జ్ఞానానందములు అనండీ, ఏ పేరుతో ఎలా చెప్పినా ఆ సర్వవ్యాపక స్థితిని వాగ్రూపంలో పెట్టేటప్పటికే పరిమితమైపోయింది. వాక్కుగా వ్యక్తం అయ్యేటప్పటికే పరిమితమైపోయిందట. ఎందుకనిట? వాక్కుగా వ్యక్తం అవ్వాలంటే మనోబుద్ధులు పనిచేయాలా? అక్కర్లేదా? మరి మనోబుద్ధులు పనిచేయాలంటే, ఆ సర్వవ్యాపకమైనదంతా ఏమైపోయింది ఇప్పుడు? వచ్చేయలా? పరిమితం అయిపోలేదా? వాక్కుగా వచ్చేటప్పటికి, ఇంకా పరిమితం అయిపోయింది. అర్థమైందా అండీ!

            కాబట్టి ఏమంటున్నాము మనం? అప్రాప్య మనసా సహ - మనసుతో గానీ, వాక్కుతో గానీ, ఊహించడానికి చెప్పడానికి వీలుకానటువంటిది ఏదైతే వున్నదో అంతే కదండీ! పెద్దవాళ్లు అందరూ ఏం చెప్పారు? యతో వాచో నివర్తంతే - ఎక్కడైతే వాక్కు తనంతట తానుగా లేకుండా వుంటుందో అంటే, వాక్కు యొక్క మూలం తెలిసి వుండాలి నీకు. ఎక్కడ నుంచి వాక్కు ఉద్భవిస్తోందో, ఏ స్థితి నుంచైతే శబ్దం ఉద్భవిస్తోందో, ఆ శబ్దానికి మూలమైనటువంటి నిశ్శబ్దస్థితిలో, ఎక్కడినుంచైతే ఆలోచన ఉత్పన్నమౌతోందో, ఆ ఆలోచనకు మూలమైనటువంటి స్థితిలో ఎట్లా అయితే ఆలోచన లేకుండా వున్నదో, ఎక్కడైతే సంకల్పం వుద్భవిస్తోందో, ఎక్కడైతే అట్టి సంకల్పమనే వ్యాపారమే లేకుండా వున్నటువంటి సహజ నిర్వికల్పం ఏదైతే అయివున్నదో... ఇలా చెప్పుకుంటూ వచ్చారు. అర్థమైందా అండీ!

            పైదాని గురించి చెప్పవయ్యా అని అంటే దేనిని గురించి చెప్పారు? క్రింద దాని సంగతి అంతా, ఇదంతా లేనిది ఎక్కడైతే వుందో అది ఇది. అని చెప్పారు. అర్థమైందా అండీ! కాబట్టి మన ఇంద్రియములన్నీ ఇప్పుడు ఈ వ్యాపారంలోకి వస్తున్నాయా? రావడం లేదా? వస్తున్నాయి. ఈ వ్యాపారములోకి వచ్చినప్పుడు, మరి దీని వ్యాపార రహితమైన స్థితి దీనికంటే ముందు వుందా లేదా? వుందిగా. మెలకువలో మనం అన్ని ఇంద్రియాలనీ ఉపయోగిస్తున్నాము. నిద్రావస్థలో వుపయోగించడం లేదు. నిద్రావస్థలో ఈ ఇంద్రియాలకు వ్యాపారం వుందా? లేదా? వుండి లేదా? లేక వున్నయ్యా? కాబట్టి, నీవు విచారణ అంతా దేనిని బట్టి తెలుసుకోవాలయ్యా అని అంటే, నీ నిద్రావస్థను నీవు విచారణ చెయ్యి మొట్టమొదట. ఎందుకనిట? అక్కడ నువ్వు మెలకువలో చేస్తున్నవన్నీ లేకుండా వున్నావు. నువ్వు ఎలా వున్నావట? మెలకువలో చేస్తున్నవాటన్నటినీ లేకుండా వున్నావు. మెలకువలో వీటితో పనిచేస్తూ వున్నప్పుడు, ఈ పనిచేయడమే నువ్వు అనుకుంటున్నావు. ఇక్కడ వచ్చిన చిక్కు ఏమిటట? ఈ పనిచేయడమే నువ్వు అనుకుంటున్నావు. క్రమంగా మెలకువ స్థితిని దాటి కలలోకి వెళ్ళేటప్పటికి ఏమైంది? ఈ పనిచేయడం పోయింది. పని చేయడానికి ఆధారమైన ప్రేరణలతో కల జరుగుతోంది. మెలకువలోనేమో పనులతోనే పని జరుగుతోంది, కలలో ఏమో దేనితో పనులు జరుగుతోంది? పనులకు ఆధారమైనటువంటి ప్రేరణా స్థితులతో కల జరుగుతోంది. దానవతల ఇంకో మెట్టు అవతలకు వెళ్ళేటప్పటికి అవి కూడా ఒక తెర వెనక్కి పోయింది. నిద్ర అనే తెర వెనక్కి పోయినాయి. అక్కడ ఏమైపోయినాయట ఇప్పడు అవి? ఇప్పుడు ఇంద్రియాలు లేవా నీకిప్పుడు? వున్నాయి. కానీ ఎలా వున్నాయి? వ్యాపార రహితంగా వున్నాయి. కాబట్టి వుండి లేకుండా వున్నాయి. లేవా? అంటే వున్నాయి. వున్నాయా? అంటే వుండీ లేకుండా వున్నాయి. వున్నాయా లేవా? నీవు ఎలా వున్నావు, ఇప్పుడక్కడా? మెలకువలో వున్నంత వరకూ ఇంద్రియాలు పనిచేస్తేనే ఆ పనే నువ్వుగా వున్న వాడవు, కలలో ఆ పనులకు ప్రేరణగా వున్నటువంటి వాడవు, నిద్రలో వ్యాపార రహితంగా వున్నటువంటి స్థితిలో వున్నటువంటి వాడవు. అంతేనా కాదా? ఈ మూడు స్థితులు వున్నాయా లేవా నీకు ఇప్పుడు? ఈ మూడు స్థితులలో కూడా నువ్వు వాటితో కలిసి పోతున్నావా? విడిగా వున్నావా? కలిసి పోతున్నావా? విడిగా వున్నవా? మెలకువలో పని జరుగుతుందండీ, కలిసిపోతే ఏమయ్యావు? జీవుడవైనావు. విడిగా వుంటే ఏమయ్యావు? సాక్షివి అయ్యావు. విడిగా వుంటే ఏమయ్యావు? మెలకువలో చేసే పనికి సాక్షివి. ఫలితాలకు సాక్షివి. విషయాలకు సాక్షివి. ఇంద్రియాలకు సాక్షివి. కలలో? ఆ ఇంద్రియాల ప్రేరణలకు సాక్షివి. మనో బుద్ధులకు సాక్షివి. నిద్రలో? చిత్త, అహంకారములకు సాక్షివి. నిద్రావస్థలో ఎక్కడున్నావు? చిత్తం అహంకారం మధ్యలో వున్నావు. అటు ఇటు కాకుండా. కదిలితే ఆ అహంకారం చిత్తం, కదలక పోతే అహం అహంగానే వుండిపోతుంది. ఆకార భ్రాంతిని పొందదు. ఆ రకంగా నువ్వు ప్రజ్ఞా స్థితిలో వున్నావు. కానీ గుర్తుపట్టలేకుండా వున్నావు. కారణం ఆ అహంకారం, చిత్తం మధ్యలో నిద్రాస్థితిలో వున్నావు కాబట్టి. ఆ వాసనాబల ప్రభావంలో మునిగి వున్నావు కాబట్టి. అది అజ్ఞాన అంధకారం కాబట్టి ఆ వాసనాబలం వచ్చినప్పుడు నీకు ఆ గాఢ నిద్రావస్థలో చీకటిగానే నీకది ప్రకటితమౌతున్నది కాబట్టి. కాబట్టి అందరం గాఢ నిద్రావస్థలో వెలుగులో వున్నామా? చీకటిలో వున్నామా? చూడండి మరి నిద్రపోయేటప్పుడు. చీకటి ఆవరించకూడదు. నిద్ర వచ్చేసేటప్పటికి బుద్ధిని చీకటి ఆవరించేస్తుంది. ఎక్కడి నుంచి వచ్చిందట ఇప్పుడది? నీ నుంచే అది వచ్చింది. బయట నుంచీ వచ్చిందా? లేదు కదా! నీ యందే ఎక్కడ వున్నదటా? ఇప్పుడది? చిత్తం అహంకారం మధ్యలో వున్నది. అక్కడ నీవు నీ ప్రజ్ఞ అక్కడ ఆగిపోతోంది. ఇప్పుడు తురీయంలో వున్నవాడికి ఏమిటట ప్రయోజనం అంటే? ఆ నిద్రావస్థకు కూడా అతను సాక్షిగా వున్నాడు. ఈ చిత్తము, అహంకారానికి కూడా సాక్షిగా వున్నాడు. వుంటే ఏమిటట పరమ ప్రయోజనం? అంటే, చిద్రూపం అయ్యాడు. ఇప్పడు ఏమయ్యాడండీ? ఎవరైతే తురీయ ప్రవేశం, తురీయానుభవం కలిగిన వారు వున్నారో, వారిని ఏమనాలట ఇప్పుడు? చిద్రూపం. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, అక్కడ ఏముంది చదవండి, చివరి వాక్యంలో. యతి వరా! శాస్త్ర స్వరూపా! చిద్రూపా! అని వుంది. ఈ చిద్రూపం అంటే అర్థం ఇది. మూడు అవస్థలకి సాక్షివై, ఎవరైతే తురీయానుభవం బ్రహ్మానుభవంలో వున్నారో, వాళ్ళందరూ ఎవరండీ? చిద్రూపులు. వాళ్ళకి చిత్త ప్రభావం లేదు వాళ్ళ మీద. చిత్తం యొక్క, మనోమయ కోశం యొక్క, విజ్ఞానమయ కోశం యొక్క, ఆనందమయ కోశం యొక్క ప్రభావాలు వాళ్ళ మీద ఏమీ లేవు. అర్థమైందా అండీ! 

            ఆత్మ పంచకోశ విలక్షణం. అంతే కదండీ! అంతేనా? వ్యతిరిక్తం. అంటే ఈ పంచకోశాలకు ఏ లక్షణాలు వున్నాయో, దానికి అవి లేవు అని అర్థం. ఎందుకు చెప్పారయ్యా ఈ పంచ కోశాలు? ఇందాక చెప్పాను మీకు, నిశ్శబ్దం బ్రహ్మముచ్యతే. బ్రహ్మము అంటే ఏమిటయ్యా? నిశ్శబ్దమే బ్రహ్మము. నీకు తెలిసిన ప్రపంచం అంతా దేనితో కూడుకుని వుంది? శబ్దంతో కూడుకుని వుంది. దీనికి ముందు ఏముందయ్యాఇది లేదు. అర్థమైందా అండీ! దీనికి ముందు ఏముంది అని అడిగితే ఏం ప్రశ్న చెప్పావు? ఇది లేదయ్యా బాబు. నీకు తెలిసినదంతా లేదు. అదేమిటి? అది బ్రహ్మము. ఇది లేదంటే ఏదైతే మిగిలి వున్నదో, అదంతా బ్రహ్మమే. మరి ఇది వున్నప్పుడో? ఇది కూడా బ్రహ్మమే. అంటే అర్థం ఏమిటట? ఇది లేకముందు వున్న స్థితిని గనుక నీవు ఒప్పుకుని అందులో నిలబడి అక్కడి నుంచి దీనిని చూస్తే, ఇది కూడా అదే. అక్కడి దాకా చూడలేదు. దీనిని మాత్రమే చూస్తున్నావు, నీ కళ్ళ ఎదుట వున్నదానిని మాత్రమే చూస్తున్నావు. నీకు ఎప్పటికీ మాత్రం అర్థం కాలేదు. నీకెప్పటికీ దీని అవతల వున్నది ఎప్పటికీ నీవసలు తెలుసుకోవడం లేదు. అంటే నువ్వు దృష్టిని అక్కడిదాకా వ్యాపకం చెందించలేవు. ఆ సర్వవ్యాపక లక్షణ స్థితిగా నువ్వు మారలేవు. అర్థమైందా అండీ! ఏమైంది అప్పుడూ? ఈ దేశము, కాలము, వస్తువు, గుణము, రూపము అనే ఐదు లక్షణాలు నీ కళ్ళ ఎదురుగుండా వున్నటువంటి దానికి వున్నాయి. ఇది దేని ప్రభావం చేత వున్నది? చిత్తం ప్రభావం చేత వున్నది. వాసనాబల ప్రభావం చేత వున్నది ఈ ఐదు లక్షణాలు కూడా. ఎవడైతే మూడు అవస్థలను దాటి, బ్రహ్మానుభవంలో స్థితుడై, స్థిరమై వున్నాడో, వాడు చిద్రూపుడు. ఎందుకనిట? నిశ్శబ్దం బ్రహ్మముచ్యతే. శబ్దజాలమయం కదండీ ఇదంతా కూడా. శబ్దము చేత సృజించబడింది. ఈ శబ్దం చేత సృజించబడిన దీంట్లో ఈ అయిదు లక్షణాలు వున్నాయి. కాబట్టి అటువంటి బ్రహ్మానుభవం కలిగినటువంటి చిన్మయానంద స్వామికి నమస్సులివె. అర్థమైందా అండీ! అది ఆయన గురు స్వరూపం అంటే.

            ఈ అష్టావక్ర గీత మనందరికీ సులభమైనటువంటి పద్ధతిలో అందించినటువంటి మహానుభావుడు చిన్మయానందులు. ఇది మనం క్రమంగా పరిశీలిస్తాము. పరిశీలించేటప్పుడు మీరందరూ కూడాను, వివేకచూడామణి చదివిన వారై వుండాలి. అది అవగాహన అయి వుండాలి. వివేకచూడామణిలో వున్న అంశాలని కొంచెం పై భావనలో తెలుసుకుంటాం. మీరు పూర్వం వివేక చూడా మణి చదివారా? అవగాహన వుందా? అయినా మన దగ్గర వుంది వివేకచూడామణి, ఎక్కడికక్కడ మీరు అష్టావక్రగీతలో ఒక పాయింటు ఇక్కడ చదువుకుంటూ, దీనికి సంబంధించినది వివేకచూడామణిలో ఎక్కడ వుంది అనేది బేరీజు వేసుకోవాలి. రెండు గ్రంథాలు ప్రక్కనే పెట్టుకుని, అదే విషయం వివేకచూడామణిలో ఏముంది? ముందు వివేకచూడామణిలో ఏముందో స్థిరంగా పూర్తిచేయగలగాలి. ఇప్పుడు అష్టావక్ర గీతలో దాని పై భావం వుంటుంది. ఈ పై భావాన్ని దాన్ని ఆధారం చేసుకుని అందుకోవాలి. ఈ రెండూ ఒకేసారి బాలెన్స్‌ అవ్వాలి. అయితే గానీ నువ్వు అష్టావక్రగీత పై విషయాన్ని అందుకోవడానికి స్థిరపడవు. కాబట్టి మీలో ఎవరి శక్తి సామర్థ్యం మేరకు వారు, మీ బుద్ధి శక్తి ఏమేరకు సహకరిస్తే, ఆ మేరకు ప్రయత్నం చేయండి.

[ఇవాళ్టికి ఆల్రెడీ 12.30 అయ్యింది కాబట్టి ఇప్పుడు స్వస్తి. రేపు ఉదయం, ఇప్పటికే చాలా సేపు ప్రయాణం చేసి వచ్చారు కదా!]

ఓం
పూర్ణ మదః పూర్ణ మిదం
పూర్ణాత్‌ పూర్ణ ముదచ్యతే
పూర్ణస్య పూర్ణమాదాయ
పూర్ణమేవా వశిష్యతే
ఓం తత్‌ సత్‌

ఓం
సహనాభవతు సహనౌ భునక్తు
సహవీర్యం కరవావహై
తేజస్వి నామవధీతమస్తు
మా విద్విషావహై
ఓం శాంతిః శాంతిః శాంతిః

సాయిరాం