లయయోగము (అనుబంధం)

లయయోగము
(అష్టావక్రగీత ప్రవచనానంతరం అనుబంధముగా చెప్పబడిన సాధనా విధానం)


ఇది మీరందరూ కూడా తీరిక వున్నంత సేపు, మీరు నిలబెట్టుకోగలిగినంత సేపు, ఒక సాధనను కొనసాగించినప్పుడు మాత్రమే ఈ అష్టావక్ర గీతలో వున్నటువంటిది అంతా కూడా తురీయానుభవంగా చెప్తారు. ఇదంతా తురీయానుభవం. వివేకచూడామణి తురీయం గురించి ప్రస్తావించి విడిచిపెడితే, అష్టావక్రగీత తురీయానుభవంలో నిలబెట్టే ప్రయత్నం చేసింది. ఈ రెండింటి మధ్య ఒక భేదం వుంది. అంటే తురీయం మార్గ దర్శనం చేస్తుంది. ఏమేమి విడిచిపెట్టాలి? ఏమేమి ఉత్తమమైన లక్షణాలను పొందాలి. ఏ శక్తి సామర్థ్యాలు నీకు వుంటే, నీవు తురీయంలో నిలబడగలుగుతావు? అని సవిస్తరంగా చెప్పేది అంతాకూడా వివేక చూడామణి. అదే మీకు ఆ తురీయానుభవాన్ని తెలియజెప్పి, ఆ అనుభవంలో వున్నటువంటి గొప్పతనాన్ని మీకు అర్థమయ్యేట్టు చేసి, అనుభవాన్ని అందించి స్థిరపడేటట్టు చేస్తుంది అష్టావక్రగీత. ఇది ఈ రెండు గ్రంథాలకి వున్నటువంటి ప్రాథమిక లక్ష్యం. కాబట్టి మీరు మిగిలిన సమయం అంటే సత్సంగం చేసే కాలం కాక మిగిలిన సమయంలో సాధ్యమైనంత వరకూ అర్థమాతృకాయుత ప్రణవధ్యానం అనే దానిని అభ్యసించాలి. అంటే మామూలుగా ఇప్పుడు మనమందరమూ చేసే ఓంకారము త్రిమాతృకాయుతము. కారము, ‘కారము, ‘కారము తో కూడుకున్నది.
ఓఓఓ...మ్‌మ్‌మ్‌.................. అనే ఈ ఓంకారంలో అకారం, ఉకారం, మకారం త్రిమాతృకాయుతం. అయితే ఈ తురీయానుభవంలో ప్రవేశించాలన్నా, నిలబెట్టుకోవాలన్నా ఈ ఓంకారాన్ని కేవలం కార శబ్దంతో అంటే ఓమ్ మ్‌ మ్‌ మ్‌............మ్‌  ఓ...మ్‌ మ్‌ మ్‌ దీనికి ఒక ఉపమానం చెబుతారు, దూరంగా వున్న విమానం ఎలా శబ్దం చేస్తూ నీ మీద నుంచి వెళ్ళి పోయింది. అప్పుడు ఎలా వస్తుందుట? చాలా చిన్నగా వినపడుతుంది. తరువాత శబ్దం పెద్దగా అవుతుంది. తరువాత క్రమంగా దూరమైపోతుంది. అలాంటి శబ్దంతో దీనిని పోల్చారు. ఈ ధ్యానానికి ఒక గొప్ప విశిష్ఠత వున్నది. ఇది ఎవరైతే తనలో అణువణువునా దీనిని సిద్ధింప చేసుకుంటారో, ఈ సృష్టిలో వున్నటువంటి నాద శక్తి అంతా కూడా ఇందులో వుంది. అంటే ప్రణవంలో వున్నటువంటి శక్తి అంతా కూడా ఈ అర్థమాతృకలో వుంది. ఒక ఆటమ్‌ బాంబులో ఎంత శక్తి వుంటుందో, అంతటి శక్తి నీలో నిండుతుంది. ఇంకా యోగ పద్ధతిలో మాట్లాడాలి అనంటే, విశ్వప్రాణాన్ని వ్యష్టి ప్రాణంలోకి ఆహ్వానించేటటువంటి మార్గం ఇది. తద్వారా నీవు ఈ వ్యష్టి ప్రాణాన్ని విశ్వప్రాణంలో లయం చేస్తావు. ఈ సాధనలో. తద్వారా ఆ జ్ఞాన సిద్ధి అయినటువంటి, సర్వవ్యాపకమైనటువంటి, అనంతమైనటువంటి ఆద్యంతములు లేవనేటటువంటి స్ఫురణ నీకు కలుగుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరికీ మీకు ఎలా వుంది అంటే నేను పుట్టాను, నేను పెరిగాను, కొంతకాలానికి ఇది పోతుంది అనేటటువంటి జ్ఞప్తి మనలో పనిచేస్తూ వుంటుంది. ఈ జ్ఞప్తి నీకొక నేను పుట్టాను, నేను పెరిగాను, మరణిస్తాను అనేటటువంటి భావన ఇక నీలో మిగలదన్నమాట ఈ సాధనలో. ఎందుకని అంటే, నేను అనంతుడను అనేటటువంటి స్థితిలో స్థిరపడిపోతావు. నాకు ఆద్యంతములు లేవు. కారణమేమిటంటే వ్యష్టి స్థితిని కోల్పోతాడు ఈ సాధనలో. నిరంతరాయంగా చేయడం వల్ల. ఇది లయ యోగ విధానం అని అంటారు. అంటే యోగం చాలా పక్షం. అందులో లయయోగం ఒక విధానం. ఒకదానిని ఒకదాంట్లో ఉన్నతమైనటువంటి స్థితులలో, ఉన్నతమైనటువంటి ఫలములలో లయం చేయడాన్ని లయయోగం అని  అంటారు. ఈ లయయోగానికి ఆధారం ఈ అర్థమాతృకాయుత ప్రణవధ్యానం. ఈ లయయోగం ద్వారా నీ యొక్క వ్యష్టి నేను పోతుంది. వ్యష్టినేను పేరే జీవుడు. సమిష్టి నేను ఈశ్వరుడు. ఈ జీవుడు ఎగిరిపోయి, ఆ సమిష్టి నేను మిగులుతాడు. కేవల సమిష్టియైనటువంటి ఆ ఈశ్వర లక్షణం మిగిలుతుంది. అటువంటి ఉత్తమమైనటువంటి సిద్ధిని, ఉత్తమమైనటువంటి సాధ్యాన్ని అందించగలిగేటటువంటి సాధన. కాబట్టి మీరు ఎంత వీలైనంతగా దీనిని సహజత్వాన్ని పొందితే, శబ్దం లేకుండా చేయగలిగేటటువంటి స్థితి వస్తుంది. ఇప్పుడు మనం శబ్దంతోటి అంటున్నాము. సాధన తెలియడం కోసం ఇలా చెప్తున్నాం. మామూలుగా అయితే దీంట్లో ప్రాణం కలిసిపోతే ఇక, ప్రాణం కలవనంత వరకే శబ్దం వస్తుంది బయటకు. ప్రాణం అందులో కలిసిపోయిందనుకోండి, ఇంక శబ్దం రాదు. మనసు బుద్ధి కూడా కలిసిపోతే ఇంక ఆ ధ్యాన స్థితి కూడా వుండదు. రెండూ పోతాయి అప్పుడు. అట్లా క్రమంగా అధిగమించి నువ్వు పై స్థితిలో వుండిపోయేటటువంటి అవకాశం వుంది. అప్పుడు కళ్ళు తెరిచినా తెరువకపోయినా చేసినా చేయకపోయినా ఏదైనా ఒకే స్థితిలోనే వుంటావు. అక్కడ వ్యష్టినేను వుండడన్నమాట. చేసేవాడు, అనుభవించేవాడనే రెండూ ఒకేసారి లేకుండా పోతారు. ఈ లయయోగ విధానంలో వున్నటువంటి గొప్ప ఫలితం ఏమిటంటే కర్తా, భోక్తా ఇద్దరూ కూడా లేకుండా పోతారు. కేవల సమిష్టి మాత్రమే అయినటువంటి ఈశ్వరాభిమాని అట్టి ఈశ్వరుడే వుండిపోతాడు. అప్పుడు నీ అంతఃకరణం అంతాకూడా..  ఇప్పుడు ఎలా వుంది అంటే చిత్తం చేత ప్రభావితమౌతూ వున్నది, అప్పుడు చిత్‌ స్వరూపంగా చిద్రూపంగా మారిపోతుంది. నీ అంతఃకరణం జీవాంతఃకరణంగా వుండదన్నమాట. అంటే వాసనామయంగా పనిచేయదు అప్పుడు. చిచ్ఛక్తి ప్రభావం మేరకు, చిద్రూపంగా దైవీ ప్రణాళిక మేరకు పనిచేయడం ప్రారంభిస్తుంది. అలాగ ఈ అంతఃకరణ చతుష్టయాన్ని ఈ సాధన ద్వారా సమిష్టి అంతఃకరణలో లయం చేయడం అన్నమాట. అందుకని దీనిపేరు లయయోగం అని ప్రసిద్ధి.

            ఇది యోగములలో ఉత్తమమైనటువంటి, ఉన్నతతరమైనటువంటి సాధన. జ్ఞానసిద్ధిని పొందించేటటువంటి సాధన. అందువల్ల ఇది అభ్యసించడం, నిదానంగా అభ్యసించాలి. నిదానంగా ప్రయాణం చేయాలి. ఇందులో ఇతరత్రా ఏ ఫలితాలు రావు. ఈ సాధనలో ఏ రకమైన ఫలితాలు రావు. ఏ రకమైనటువంటి సిద్ధులు రావు. ఏ రకమైనటువంటి మహిమలు చేయవు. కారణం ఏమిటి? నిన్ను కోల్పోవడానికి మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. నువ్వు లేకుండా పోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఎవరున్నారయ్యా అంటే పరమేశ్వరుడే వున్నాడు. ఎల్లవేళల సర్వకాల సర్వావస్థలలో నీ రూపంలో కూడా పరమేశ్వరుడే వున్నాడు. నువ్వు దేశం అన్నావు అదీ పరమేశ్వరుడే. కాలం అన్నావు అదీ పరమేశ్వరుడే. వస్తువు అన్నావు అదీ పరమేశ్వరుడే. రూపం అన్నావు అదీ పరమేశ్వరుడే. గుణం అన్నావు అదీ పరమేశ్వరుడే. అంతా ఈశ్వరమయంగానే నీకు కనపడుతుంది. అలా కనపడేట్టుగా వచ్చే దృష్టిని కలిగిస్తుంది. అంతే దీని ఫలితము. ఇంతకు మించి ఈ లయయోగ సాధన వల్ల వేరే ఏ ఫలితమూ రాదు. అంటే ఐహిక ఫలితాలను సాధించడానికి ఈ సాధన పనికిరాదు. అర్థమైందా అండీ! అంటే ప్రతి సాధనకీ కూడా ఒక నిర్దిష్టమైనటువంటి ప్రమాణం, పరిజ్ఞానం, విజ్ఞానం అవసరం. ప్రమాణం అంటే ఎలా చేయాలి? చేస్తే ఫలితం ఏమిటి? ముందే అనుభవజ్ఞులందరూ చేసి, సాధించి, నిర్ణయం చేసి విడిచి పెట్టారు. ఇదిగో ఇది దీనికే పనికి వస్తుంది. పరిజ్ఞానం అంటే గురువు దగ్గర అధ్యయనం చేయాలి, అభ్యాసం చేయాలి. విజ్ఞానం - నీవు స్వయంగా సాధించాలి. అప్పుడు విజ్ఞానం. ఇతరులకు ఉపయోగించాలి అప్పుడు సుజ్ఞానం. అర్థమైందా అండీ! నీ వరకే వినియోగించుకున్నావు అప్పుడది విజ్ఞానం. ఇతరులకు కూడా దానిని అధ్యయనం చేయడానికి బోధించి, దానిని అర్థమయ్యేట్టు చేసి, వాడు దానిని సాధించ గలిగేట్టుగా చేయగలిగావు అప్పుడు సుజ్ఞానం. కాబట్టి జ్ఞానాన్ని అధిగమించాలి అంటే ఆ జ్ఞానం అనేది విజ్ఞానం, సుజ్ఞానంగా మార్పు చెందాలి. అప్పుడే నువ్వు జ్ఞానాన్ని అధిగమించగలుగుతావు. లేకపోతే ఈ జ్ఞానం కూడా పరిమితమైపోతుంది. కాబట్టి మహర్షి అని ఎవరినైతే మనం పిలుస్తున్నామో అటువంటి వారు అందరూ కూడా ఏం సాధించారయ్యా అంటే, ఇలాగే సాధించారు. అర్థమైందా అండీ!
            [ఇంకా విశేషాలు రేపు చెప్పుకుందాం, జైబాబా]